యేసు ప్రభువు

 

యేసు ప్రభువు

ప్రజల పాపరాశి పారద్రోలగనెంచి

శిలువ నెక్కె యేసు శిక్ష నోర్చి;

దైవపుత్రుడైన దప్పెనా కష్టాలు

ధార పోసె తనువు త్యాగమూర్తి.

 

పలుకు పలుకులోన  పల్లవించును ప్రేమ

శత్రువైననేమి శరణు నొసగు;

నిత్య సత్యమైన నీతిమార్గము జూపు 

ధర్మబోధ జేయు ధన్యమూర్తి.

 

దారిదప్పువాని  దరిజేర్చి రక్షించు

మేరిమాత సుతుడు; మేటి ఘనుడు;

విశ్వప్రేమ తోడ విలసిల్లె జగమెల్ల;

కాంచి సంతసించె కరుణమూర్తి.

 

పరమ పాపులయిన పరమ నీచులయిన 

ప్రభువు ప్రేమ పుణ్యభరితు లయిరి;

సకల జనుల హితము సర్వదా కాంక్షించు

పుడమి పుత్రుడతడు పుణ్యమూర్తి.

No comments:

Post a Comment

   అంకితము          జననీ జనకులకు కల్యాణ స్వర్ణోత్సవ సందర్భముగా                     ( 02.06.1967  –  02.06.2017)                             ...