అంతర్వేదం (శతకం)

 

      

1.      

అన్నివిద్యలందు నధికుడైనను గాని                              

తనను  తెల్పు విద్య తనకు రక్ష;

విద్యలందు బ్రహ్మవిద్యయే శ్రేష్ఠంబు!                

భువిని జ్ఞాన మొకటె ముక్తి  నిచ్చు.

 

2.      

ఆత్మ నెరుగు వాడు నదియె తానగుచుండు

అగ్ని లోని కణము అగ్ని రీతి;

నరుడు కూడ నట్లె నరహరి యగుకదా!

భువిని జ్ఞాన మొకటె ముక్తి  నిచ్చు.

 

3.      

నిత్యకర్మలెల్ల నిరుపయోగములౌను

నిత్యమైన దాని నెరుగ  కున్న;

నిత్యమైన ఆత్మ నిమిషమైన గనుము;

భువిని జ్ఞాన మొకటె ముక్తి  నిచ్చు.

 

4.      

తత్వమందు మేటితత్వవేత్తకు నైన

అనుభవాన  గలదె ఆత్మ ఎపుడు?

దాటగలరె మాయ దక్షత లేకున్న?

భువిని జ్ఞాన మొకటె ముక్తి  నిచ్చు.

 

 

5.      

కర్మ యందు ప్రీతి కైవల్య మిచ్చునా?

కర్త నెరుగ నీవు కదల వోయి!

కర్మ ఎపుడు జడము; కర్తయే అధిపతి;

భువిని జ్ఞాన మొకటె ముక్తి  నిచ్చు.

 

6.      

పాపకర్మ మెపుడు పతనము చేకూర్చు;

పుణ్యకర్మ వలన పొసగు ప్రగతి;

పాపపుణ్యగతులు బంధకారణములు;

భువిని జ్ఞాన మొకటె ముక్తి  నిచ్చు.

 

7.      

తనివితీర మనిషి తలపోయు తలపులు;

తలపు ననుసరించి తనువు కదలు;

తనువు తిప్పలెన్నొ తలపుల మూలాన!  

భువిని జ్ఞాన మొకటె ముక్తి  నిచ్చు.

 

8.      

స్వప్నతుల్యమైన సంసార మీక్షింపు;  

ద్వేషరాగ మయము తేరిచూడ;                   

“కలయె నిజము” వోలె కనిపించు కాసేపు;

భువిని జ్ఞాన మొకటె ముక్తి  నిచ్చు.

 

 

9.      

మరల మరల జీవి మహిలోన జన్మించు  

కర్మఫలము నందు కాంక్షతోడ;

సౌఖ్యమందు కోర్కె సద్గతి కడ్డులే!

భువిని జ్ఞాన మొకటె ముక్తి  నిచ్చు.

 

10.            

జనన మరణ రూప సంసార చక్రాన

తిరిగి తిరిగి దేహి తిరుగుచుండు;

నిజము తెలిసినంత  నిలచునా దేహాన?

భువిని జ్ఞాన మొకటె ముక్తి  నిచ్చు.

 

11.            

శిలను దాగి నట్టి శిల్పంబు గొప్పదే;

శిలయె లేనినాడు శిల్పమేది?

మేను ఉన్ననాడె మృత్యువధిగమింపు!

భువిని జ్ఞాన మొకటె ముక్తి  నిచ్చు.

 

12.            

కత్తిమీదసాము  కట్టివేయ మనసు;

కదలి తరలి పోవు కాన కున్న;

మనసు నిలిచె నేని మహిలోన మోక్షంబు!

భువిని జ్ఞాన మొకటె ముక్తి  నిచ్చు.

 

 

13.            

ఇచట నచట వెదకి ఇల్లాలు చింతించె  

మిసిమి తాళిబొట్టు మెడనెయుండ;

తెలియనంతవరకె  తీరని చింతలు!

భువిని జ్ఞాన మొకటె ముక్తి  నిచ్చు.

 

14.            

చిత్తమందు పూజ శివునికై జరిగేను;

బయట జరుగు పూజ పరుల కొరకు;

పూజ లెన్ని నాళ్ళు?  పురుషుని కనుగొను!

భువిని జ్ఞాన మొకటె ముక్తి  నిచ్చు.

 

15.            

దేవపూజ లోనె దినమెల్ల గడిపెను;   

ఏళ్ళు కదలి పోయె; ఇతడు పోయె;

పుణ్య మేమొ దక్కె;  “పురుషుండు” దక్కెనా?

భువిని జ్ఞాన మొకటె ముక్తి  నిచ్చు.

 

16.            

మాయ తానె యగుచు మాయ కతీతుడై

మాయ లోన ముంచు మాయలోడు;

మనసు నందు దాగు మా మహేశ్వరుడుగా;

భువిని జ్ఞాన మొకటె ముక్తి  నిచ్చు.

 

 

17.            

అన్ని విషయములను ఆయనకర్పించు!

అదె చిదంబరుండు హరుని గనుము!

అంబరమ్ము నంటు ఆశలు నీకేల?

భువిని జ్ఞాన మొకటె ముక్తి  నిచ్చు.

 

18.            

తాండవమ్ము సలుపు చండికానాధుండు

భక్తజనుల కెపుడు శక్తి నొసగు;

పాపపంక్తి నణచు పదఘట్టనలతోడ;

భువిని జ్ఞాన మొకటె ముక్తి  నిచ్చు.

 

19.            

నటనమాడు నరుడు నానావిధంబుల

“నిజము”నెరుగు వరకు నేర్పు మీర

నటన నాట్యమయ్యె నటరాజు గనినంత

భువిని జ్ఞాన మొకటె ముక్తి  నిచ్చు.

 

20.            

శక్తియుక్తిమరచి శవముగా మారకు;

చిత్తమందు శివుని చేర్చి కొలువు;

నిత్యమైన శాంతి నీకిచ్చు  త్రిపురారి!

భువిని జ్ఞాన మొకటె ముక్తి  నిచ్చు.

 

 

21.            

విషము తోడ సమము విషయమందాసక్తి;

వాటి పైన నీవు వాంఛ విడుము;

శంకర గురు వాక్కు శంకల తొలగించు!

భువిని జ్ఞాన మొకటె ముక్తి  నిచ్చు.

 

22.            

అమితనిష్ఠతోడ  ఆత్మలో లీనమౌ

దీక్ష బూన నదియె దివ్యరక్ష;

ఒట్టిపొట్ట మాడ్చ ఉపవాస మెట్లగున్?

భువిని జ్ఞాన మొకటె ముక్తి  నిచ్చు.

 

23.            

చెట్టు దయ్య మయ్యె చీకటి మాటున;

నిజము నెరుగ లేవు నీవు నపుడు;

ఆత్మ తెలియ బడున అజ్ఞాన మందున?

భువిని జ్ఞాన మొకటె ముక్తి  నిచ్చు.

 

24.            

బోధ చేయు వాడు; బోధ వినెడు వాడు;

బోధ యనునదొకటి  భువిని త్రిపుటి;

ఆత్మ నెరిగి నంత  అంతయు నొకటిరా!             

భువిని జ్ఞాన మొకటె ముక్తి  నిచ్చు.

 

 

25.            

అటునిటు పరుగెత్తు; ఆవేదన పడును;

ఆశల వలయాన ఆహుతగును;

చిత్తు నెరుగ లేని చిత్తాల వెతలివ్వి;

భువిని జ్ఞాన మొకటె ముక్తి  నిచ్చు.

 

26.            

శాస్త్రమందు మేటిశాస్త్రవేత్తకు నైన

భ్రాంతి తొలగకున్న భయము పోదు;

చిత్తశక్తి చేయు చిద్విలాస మిదియె;

భువిని జ్ఞాన మొకటె ముక్తి  నిచ్చు.

 

27.            

క్లిష్ట మన్నదిలేదు  ఇష్టమౌ పనిలోన;

ద్రష్ట నెరుగు టందు కష్ట మేమి?

నిన్ను నీవు కనుట నీకేల కష్ఠంబు!

భువిని జ్ఞాన మొకటె ముక్తి  నిచ్చు.

 

28.            

ఈశుడాడు ఆట ఈవిశ్వమంతయు;

చలన మచలనమ్ము సత్తసత్తు;

“నేనెవండ”నంచు నిన్ను నీవడుగుము!                      

భువిని జ్ఞాన మొకటె ముక్తి  నిచ్చు.

 

 

29.            

కామ్యబుద్ధితోడ కావించు కార్యముల్

బంధకారణములు వదల వెపుడు;

కామ్యరహిత కర్మ కర్తను తాకదు;

భువిని జ్ఞాన మొకటె ముక్తి  నిచ్చు.

 

30.            

కోర్కె తీరినంత కుదుట బడగ లేవు;

కాంక్ష మీద కాంక్ష కలుగు చుండు;

కాంక్ష లేని నాడు కలుగులే సౌఖ్యంబు;

భువిని జ్ఞాన మొకటె ముక్తి  నిచ్చు.

 

31.            

అల్పబుద్దు లెపుడు ఆరాట పడెదరు

పత్ని పుత్ర పౌత్ర బంధనముల;

బంధనములు తెంచు; భగవంతు డగుపించు;

భువిని జ్ఞాన మొకటె ముక్తి  నిచ్చు.

 

32.            

మదపుటేన్గు వంటి మనసునే మధియింపు

చరమసత్యమైన పరము గూర్చి;

సాధనమ్ము సలుప సాయుజ్య మబ్బేను;

భువిని జ్ఞాన మొకటె ముక్తి  నిచ్చు.

 

 

33.            

విషయభోగములను విడువంగవలయును;

వస్తువేది యైన వదలి పోవు;

ఆత్మచింతనంబు అందించు సౌఖ్యంబు!

భువిని జ్ఞాన మొకటె ముక్తి  నిచ్చు.

 

34.            

తపము చేసినంత తాపమ్ము నశియించు;

మనసు శుద్ది చెంది మదము తగ్గు;

నిత్య సాధనంబు నీకు శాంతిని గూర్చు;

భువిని జ్ఞాన మొకటె ముక్తి  నిచ్చు.

 

35.            

మరల పుట్టెనేని మారునా వ్రాతలు?

మౌనమందు నెపుడు మనసు నిలుపు;

మంచినీడ వీడి మండుటెండన పోకు!

భువిని జ్ఞాన మొకటె ముక్తి  నిచ్చు.

 

36.            

మనసులోన తలపు మలిన మందనినాడు

మధురమైన మాట మనసు పలుకు;

వాక్కు తోడ చేయు వాచిక తపమది;

భువిని జ్ఞాన మొకటె ముక్తి  నిచ్చు.

 

 

37.            

ప్రశ్న పడిన నాడు పరమాత్మ ఎవడని

ప్రగతిబాట నీవు పట్టినట్టు;

శోధనమ్మె దారి; శూరుడే సాధించు; 

భువిని జ్ఞాన మొకటె ముక్తి  నిచ్చు.

 

38.            

గురువు జ్ఞానమిచ్చు;  గొప్పమార్గము చూపు;

గురువు లేని నాడు కొరత నీకు;

ప్రగతిపథము చేరు  ప్రాజ్ఞు ననుసరించి;            

భువిని జ్ఞాన మొకటె ముక్తి  నిచ్చు.

 

39.            

మదిని మార్పు చేసి;  మార్గమ్ము చూపించి;

లక్ష్యసాధ నమున రక్ష నిచ్చి;

కర్మ, భక్తి, జ్ఞాన గతులనిల్పు గురుడు;

భువిని జ్ఞాన మొకటె ముక్తి  నిచ్చు.

 

40.            

దూరదృష్టి లేని దుర్బుద్ధి  యెరుగునా

దుఃఖమందు  మూలదోష మేదొ?

ఆత్మవేత్త వాక్కు అమితసాంత్వన మిచ్చు;

భువిని జ్ఞాన మొకటె ముక్తి  నిచ్చు.

 

 

41.            

ఆయువెన్నినాళ్ళు!  అలసత్వమును వీడు;

నిదురలేచి గనుము  నిన్ను నీవు;

ఆత్మతత్వమెరిగి అమరత్వమును పొందు;

భువిని జ్ఞాన మొకటె ముక్తి  నిచ్చు.

 

42.            

నిన్ను నీకు చూపు నిత్యమౌ సత్యంబు

తెలిసినంత నీకు కలుగు శాంతి;

ఎరుక నెపుడు నీవు ఎడబాయకుండుము;

భువిని జ్ఞాన మొకటె ముక్తి  నిచ్చు.

 

43.            

అంతు పొంతు లేని అజ్ఞానవిద్యలు  

నిజము నెరుగనీవు నిన్ను నెపుడు;

విద్యలందు మేటి వేదాంతవిద్యరా! 

భువిని జ్ఞాన మొకటె ముక్తి  నిచ్చు.

 

44.            

తనని తాను కనక తప్పుకు తిరిగెడి

చక్రవర్తికైన శాంతి గలదె?

ఆత్మ కొరకు తపన ఆనందమును గూర్చు;

భువిని జ్ఞాన మొకటె ముక్తి  నిచ్చు.

 

 

45.            

సూక్ష్మ బుద్ధితోడ  శుద్ధచిత్తమునంది    

శాస్త్రమభ్యసించు సజ్జనుండు  

సర్వజనులలోన  సత్యమే దర్శించు;

భువిని జ్ఞాన మొకటె ముక్తి  నిచ్చు.

 

46.            

నల్లచీర కట్ట నల్లపిల్లగునేమి?

కాంతులీను కన్నె కానరేమి?

దేహ భ్రాంతి వీడి దేహిని దర్శించు;

భువిని జ్ఞాన మొకటె ముక్తి  నిచ్చు.

 

47.            

సకల శుభము లొసగు సత్యసంకల్పుండు                   

శక్తియుక్తు లొసగు సర్వులకును;

సకలసృష్టి కతడె సాక్షిస్వరూపంబు;

భువిని జ్ఞాన మొకటె ముక్తి  నిచ్చు.

 

48.            

భేదరహితునందు భేదభావన వచ్చె;

భావనమ్ము మారె బంధములుగ;

బంధనాలు దాల్చె వాసనారూపాలు;

భువిని జ్ఞాన మొకటె ముక్తి  నిచ్చు.

 

 

49.            

ఆత్మ శాశ్వతంబు ఆద్యంతరహితంబు;

ఆత్మయన్న దొకటె అందరందు;  

ఆత్మ వ్యాప్తినొందె ఆకాశరీతిగా;

భువిని జ్ఞాన మొకటె ముక్తి  నిచ్చు.

 

50.            

మబ్బు కప్ప గలదె మండెడి సూర్యుని?

గాలి తాకినంత కదలిపోవు;

ఆత్మకాంతి గనిన అజ్ఞానము తొలగు;

భువిని జ్ఞాన మొకటె ముక్తి  నిచ్చు.

 

51.            

నీవు చూచు జగము నిత్యమై కదలాడు;    

త్రాడు సర్ప మట్లు తమము నందు;

బ్రహ్మమొకటె నిజము భ్రాంతియే జగమంత!  

భువిని జ్ఞాన మొకటె ముక్తి  నిచ్చు.

 

52.            

నీటిలోన పుట్టి నీటిలో కలిసెడి;

నీటిబుడగ లెపుడు నీరెయగును;

జగము పుట్టిపెరుగు జగదీశులోపలే!

భువిని జ్ఞాన మొకటె ముక్తి  నిచ్చు.

 

 

53.            

అలలు నురగ బుడగ లంభోధి యందుండు; 

నీరు నీరె గాని పేరు మార్పు; 

జీవులెన్నొ గాని జీవేశ్వరు డొకడె!

భువిని జ్ఞాన మొకటె ముక్తి  నిచ్చు.

 

54.            

మనసులోన పుట్టి మనసులో పెరుగుచు

మనసునందె లీనమగును కలలు

బ్రహ్మమందు కదలు బ్రహ్మాండముల రీతి;

భువిని జ్ఞాన మొకటె ముక్తి  నిచ్చు.

 

55.            

అన్ని ఇమిడియుండు ఆకాశ మందున;

మిన్ను నంట కుండ మిన్న కుండు;

జగము లెన్ని యున్న జగదీశు నంటునా!                    

భువిని జ్ఞాన మొకటె ముక్తి  నిచ్చు.

 

56.            

కడలిపైన మిన్ను కడవలోన గలదు;

ఎక్కడున్న నేమి? ఏక మదియె; 

“తాను”లేని చోట నేనుకు తావేది?                                         

భువిని జ్ఞాన మొకటె ముక్తి  నిచ్చు.

 

 

57.            

స్వర్ణ వస్తు వందు స్వర్ణమే యున్నను 

నామ రూప మందు నయన ముండు;

కాంచ గలుగు వేళ కన్నదే బ్రహ్మంబు!  

భువిని జ్ఞాన మొకటె ముక్తి  నిచ్చు.

 

58.            

మట్టి కుండలందు మట్టియే సత్యంబు;

కుండ లెన్ని యున్న గుట్టు నొకటె;

తనువు లెన్ని యున్న దైవం బదొక్కటే!

భువిని జ్ఞాన మొకటె ముక్తి  నిచ్చు.

 

59.            

కర్త తాను; మనకు కర్తృత్వ మదియేల?

సూత్రధారి గనుము పాత్రధారి!

సర్వభయవిముక్తి  స్వస్వరూపం బిచ్చు;

భువిని జ్ఞాన మొకటె ముక్తి  నిచ్చు.

 

60.            

 “మాయ” మాయ మగునె మనుజుల కర్మచే?

మాప లేదు కర్మ మాయ నెపుడు;

మాయ పారదోలు మార్గమ్ము జ్ఞానమే!

భువిని జ్ఞాన మొకటె ముక్తి  నిచ్చు.

 

 

61.            

వేష మేసి త్రోసె వేడుక సేయంగ;

వినడు కొంచెమైన వెతలు తెలుప;

వేడికంటిశివుని వేడుక తీరేన!

భువిని జ్ఞాన మొకటె ముక్తి  నిచ్చు.

 

62.            

చిమ్మినంత పోవు కమ్మిన చీకట్లు;

గంపకెత్తి సాగనంప లేవు;

చిన్నిదీప మొకటె చీల్చురా చీకట్లు!

భువిని జ్ఞాన మొకటె ముక్తి  నిచ్చు.

 

63.            

కాదు నిదియు నదియు; కాదని సర్వంబు;

త్రోసి వేయ తానె త్రోవ చూపు;

పరమ పురుషు చేర్చు పావన పథమదె;

భువిని జ్ఞాన మొకటె ముక్తి  నిచ్చు.

 

64.            

అంటి ముట్టకుండు; అన్నింట తానుండు;

సర్వశక్తిమయుడు; శాశ్వతుండు;

సకలకార్యములను సర్వజ్ఞుడైయుండు!

భువిని జ్ఞాన మొకటె ముక్తి  నిచ్చు.

 

 

65.            

“నేను” ఉన్ననాడు నిలువెల్ల కర్మలు;

“నేను” తొలగినంత నిలువలేవు;

“తాను” లేనినాడు “నేను” లేనే లేడు;

భువిని జ్ఞాన మొకటె ముక్తి  నిచ్చు.

 

66.            

జగము గాంచు నరుడు జగమె తానగుచుండె;

ఆత్మచింతనంబు నతడు మరచె;

భ్రాంతి తోడ జీవి బ్రహ్మమున్ మరచెలే!

భువిని జ్ఞాన మొకటె ముక్తి  నిచ్చు.

 

67.            

సూక్ష్మమన్న వేళ  సూక్ష్మాతిసూక్ష్మంబు;

స్థూలమన్న నాడు స్థూలమదియె;

అన్నిచోట్ల తాను భిన్నమై రాజిల్లు;

భువిని జ్ఞాన మొకటె ముక్తి  నిచ్చు.

 

68.            

పుట్టి పెరిగి పోవు పుడమిపై దేహంబు;

దేహి శాశ్వతంబు దేహ మరుగు;

అహము వీడినంత అంతయు బ్రహ్మమే;

భువిని జ్ఞాన మొకటె ముక్తి  నిచ్చు.

 

 

69.            

దేని కారణాన దేహమ్ము కదలాడి

ధర్మనిరతి తోడ కర్మ సేయు?

ఆత్మ యనగ నదియె ఆధారభూతంబు;

భువిని జ్ఞాన మొకటె ముక్తి  నిచ్చు.

 

70.            

మబ్బులోని నీరు మలిన మెరుగకుండు;

పుడమి చెలిమితోడ పుట్టు రుచులు;

జీవగుణములెల్ల  జీవేశ్వరునకెట్లు?

భువిని జ్ఞాన మొకటె ముక్తి  నిచ్చు.

 

71.            

కాలమందు కొంత కాలంబు జీవించి

మార్పు చెంది మేను మరణమందు;

ఆత్మ శాశ్వతంబు అంతమౌ దేహంబు;

భువిని జ్ఞాన మొకటె ముక్తి  నిచ్చు.

 

72.            

సూర్యరశ్మి లేదు సూర్యుని విడనాడి;

చల్లదనము నీటి సహజగుణము;

అమితనిర్మలంబు ఆత్మస్వభావంబు;

భువిని జ్ఞాన మొకటె ముక్తి  నిచ్చు.

 

 

73.            

అన్య మనుచు లేదు; ఆకార మెరుగదు;

దేశకాలమనెడి తేడ లేదు;

సర్వ వ్యాప కంబు;  సత్యమై శోభిల్లు;

భువిని జ్ఞాన మొకటె ముక్తి  నిచ్చు.

 

74.            

ఎవని నెరిగినంత నిల చింత తీరునో

అతని వెతక గోరి యరుగుచుంటి;

అతడు చూడ బోవ  ఆంతర్య మందుండె!        

భువిని జ్ఞాన మొకటె ముక్తి  నిచ్చు.

 

75.            

ఎవని బలిమి చేత ఈసృష్టి జరిగెనో   

అతడు చింత లేక హాయి నుండె;  

విడని భ్రాంతి తోడ  విలపించె ప్రజయెల్ల;                                 

భువిని జ్ఞాన మొకటె ముక్తి  నిచ్చు.

 

76.            

దేని నుండి పుట్టు? దేనిలో లయమగు?

చావు పుట్టు కన్న చర్చ లేదు;

సత్యమైన దొకటె సచ్చిదానందము;

భువిని జ్ఞాన మొకటె ముక్తి  నిచ్చు.

 

 

77.            

విషయ మన్న దెపుడు విషయికానట్లుగా

దేహమింద్రియములు దేహి కావు;

“నేను” వెలుగు చుండు నిత్యమై దివ్యమై!

భువిని జ్ఞాన మొకటె ముక్తి  నిచ్చు.

 

78.            

భిన్నమందు తా నభిన్నస్వరూపంబు;

ఆత్మజ్ఞానియెపుడు నదియె గాంచు;

అన్నివేళలందు నంతట తానుండు;

భువిని జ్ఞాన మొకటె ముక్తి  నిచ్చు.

 

79.            

సకలజాతులందు, జంతుపక్షులయందు,

గిరులు విరులు తరులు ఝరుల యందు,

విశ్వనాథుడుండు వివిధరూపాలతో!               

భువిని జ్ఞాన మొకటె ముక్తి  నిచ్చు.

 

80.            

మనసులోన తలపు మారును పలుమారు;

నిమిషమైన తలపు నిలువలేదు;

అలజడేమి లేని ఆనందమును నేను;

భువిని జ్ఞాన మొకటె ముక్తి  నిచ్చు.

 

 

81.            

చిత్త మాత్మ యందు స్థిరముగా నుండిన

చిత్రమైన రీతి  చింత పోవు;

చిత్త మేక మగుచు చిద్విలాసుని చేరు;

భువిని జ్ఞాన మొకటె ముక్తి  నిచ్చు.

 

82.            

భ్రాంతి తోడ నేను బ్రహ్మాండమును గాంతు;  

భ్రాంతి తొలగి నంత బ్రహ్మ నగుదు;

బ్రహ్మ నైన నాకు బ్రహ్మాండ భ్రమయేల?

భువిని జ్ఞాన మొకటె ముక్తి  నిచ్చు.

 

83.            

కంటచూడబోగ   కానరాకుండెనే!

మాట లాడ బోగ మౌన మాయె! 

నెచ్చటుండు నన్న నెచ్చటన్నచ్చటే!

భువిని జ్ఞాన మొకటె ముక్తి  నిచ్చు.

 

84.            

మరల మరల ఆత్మ మదిలోన తలపగా

మానసాన భ్రాంతి మాయ మగును;

మునులు చూపినట్టి మోక్షమార్గమదియె;

భువిని జ్ఞాన మొకటె ముక్తి  నిచ్చు.

 

 

85.            

తెలిసికొనగ బోవ తెలిసినట్టుగ నుండు;

తెలిసె మర్మమనిన  తెలియకుండు;

తెలిసి తెలియనట్టి తికమక “బ్రహ్మ”రా! 

భువిని జ్ఞాన మొకటె ముక్తి  నిచ్చు.

 

86.            

స్వప్నమందు నరుడు  స్వస్వరూపము వీడు;

తనని మరచి కలగ తానె మారు;

ఆత్మ యందు కదలు అఖిలలోకములట్లె;

భువిని జ్ఞాన మొకటె ముక్తి  నిచ్చు.

 

87.            

ఎచటినుండి వచ్చు? ఎచ్చటి కనిపోవు?

మార్పుచేర్పులన్న మాటలేదు;

విశ్వమందు తాను వెలుగొందు సత్యమై;

భువిని జ్ఞాన మొకటె ముక్తి  నిచ్చు.

 

88.            

నిన్ను నీవు తెలిసికొన్న శుభదినము

వెలుగులెన్నొ మదిని వెల్లివిరియు;

మోక్ష మార్గ మపుడె ముంగిట నిలుచుండు;

భువిని జ్ఞాన మొకటె ముక్తి  నిచ్చు.

 

 

89.            

“నేను” పదము నీవు నిర్మూలనము చేయ

“నరక” దైత్యు నపుడె నరకినట్లు;

కాంతినొసగు జ్యోతి కనులముందున్నట్లు;

భువిని జ్ఞాన మొకటె ముక్తి  నిచ్చు.

 

90.            

పరిసరములనన్ని పరిహార మొనరించు

గుండెతోడ నీవు గొంతు కలుపు;

“ఓం”కృతిని పలుకుచు ఒదిగిపో ఒకటిగా;

భువిని జ్ఞాన మొకటె ముక్తి  నిచ్చు.

 

91.            

మౌననిష్ఠ బూను మంచియే చేకూరు;

మనసు శక్తి నొంది మహిమ గాంచు;

విశ్వమంత అపుడు విశ్వేశురాజ్యమే!

భువిని జ్ఞాన మొకటె ముక్తి  నిచ్చు.

 

92.            

పైకి నెగయు నాత్మ పరమాత్మ నుండియే

అగ్ని నుండి ఎగయు అణువు రీతి;

చిత్తగించి చూడ జీవాత్మ పరమాత్మ!

భువిని జ్ఞాన మొకటె ముక్తి  నిచ్చు.

 

 

93.            

ఎంచి చూడ నెంతొ మంచిగా ననిపించు

మౌనపాలనంబు మనకు నెపుడు;

ధ్యానమునకు నదియె ధన్యమార్గము కదా!

భువిని జ్ఞాన మొకటె ముక్తి  నిచ్చు.

 

94.            

స్వర్గ-నరక-జన్మ సంవాదమది వద్దు;

ఆత్మభాను నింక నరయ ముద్దు;

శాంతి కలుగు నీకు సర్వదా సర్వధా!

భువిని జ్ఞాన మొకటె ముక్తి  నిచ్చు.

 

95.            

ఉండియున్న దొకటె ఉజ్వలంబగు నాత్మ;

తప్పు ఒప్పు అనుచు తిప్ప లేల?

నిత్య శాంతి తోడ నిలిచిపో ఆత్మగా!

భువిని జ్ఞాన మొకటె ముక్తి  నిచ్చు.

 

96.            

మదము మత్సరమ్ము మటుమాయమై పోయె;

 క్రోదకామములును కూలిపోయె;

లోభమోహములును  లుప్తంబులైపోయె;

భువిని జ్ఞాన మొకటె ముక్తి  నిచ్చు.

 

 

 

97.            

నాది నీది యంత నాశనంబాయెను;

“నేను” మాత్ర మొకటె నిలచి యుండె;

సత్యమైన “నేను” నిత్యమై వెల్గెలే!

భువిని జ్ఞాన మొకటె ముక్తి  నిచ్చు.

 

98.            

మొట్ట మొదట ఆత్మ “ముందున్న లోకంబు”;

చూడ చూడ చూడ “శూన్య” మదియె;

ఆ పిదప దశకిక “ఆత్మయై” పోదుము;

భువిని జ్ఞాన మొకటె ముక్తి  నిచ్చు.

 

99.            

మనసు బయటికేగ మరిచిక్కు విషయాల;

అదియె లోని కేగ “ఆత్మ” యగును;

చూడగ నపుడదియె శుద్ధమౌ మనసౌను;

భువిని జ్ఞాన మొకటె ముక్తి  నిచ్చు.

 

100.       

“తనను” చూడకుండ దైవమ్ము కనరాడు;

“తనను” లోన లోన “తడిమి” చూడు;

అంత లోనె నీకు అగుపించు దైవమే!

భువిని జ్ఞాన మొకటె ముక్తి  నిచ్చు.

 

101.       

“ఆత్మదర్శనంబు అత్యంతకష్టంబు”

అనెడి భావమెపుడు అసలు వద్దు;

అడ్డు తొలగినంత అది ఎంతొ సులభంబు!

భువిని జ్ఞాన మొకటె ముక్తి  నిచ్చు.

 

102.       

ధ్యానమందు నీవు దర్శించెదవు నిన్ను;

దేవు గూర్చి యేల దేవులాట?

నిన్ను నెరిగి నంత నీవెలే దేవుండు!

భువిని జ్ఞాన మొకటె ముక్తి  నిచ్చు.

 

103.       

ఆత్మ పూర్ణమయ్య! అది పవిత్రంబమ్మ!

ఆత్మమయ మిదంత; అది గ్రహింప;

నీకు-నాకు-మనకు నిశ్చలానందమే!

భువిని జ్ఞాన మొకటె ముక్తి  నిచ్చు.

 

No comments:

Post a Comment

   అంకితము          జననీ జనకులకు కల్యాణ స్వర్ణోత్సవ సందర్భముగా                     ( 02.06.1967  –  02.06.2017)                             ...