దూరమైన నా శివుడు

 

                                                                

ఇది జరిగిన కధ.  జరుగుతున్న కధ. జరగబోయే కధ.

 

పిల్లవాడు అడిగాడు శివుడెవరు? అని.

అమ్మ అంది శివుడు దేవుడని.

నాన్న అన్నారు శివుడు మన ఇలవేల్పు తాత ముత్తాతల నుంచి మనం పూజిస్తున్నామని.

సమాజము అంది శివుడు సర్వశక్తి సంపన్నుడు, సర్వకాల సర్వావస్థల యందు నిన్ను రక్షిస్తాడని.

పిల్లవాడు సంతోషించాడు. ఆ పసికందు మనసులో పడింది “శివ” బీజం. ఆ పిల్లవాడి పేరు “జీవ”.

 

ఏదో తెలియని ఆకర్షణ ఆ పేరులో. ఏదో ఆనందం. ఎప్పుడూ శివనామం. గుడిలో శివుడికి  పూజలు, ఆరాధనలు, భజనలు, హారతులు, అభిషేకాలు, హోమాలు, ఆర్భాటాలు, ఉత్సవాలు, ఊరేగింపులు ఒకటేమిటి అంతా పెద్ద కోలాహలం. పండగ. పసివానిలోని శివుడు దూరమయ్యాడు. గుళ్ళో దేవుడయ్యాడు.

 

“జీవ” పెద్దవాడయ్యాడు. వాడితో పాటు వాడి మనసులో నాటిన “శివ” బీజం పెద్దదై మహా వటవృక్ష మయ్యింది.

శివుడి మీద కుతూహలం పెరిగింది. “జీవ”  తెలిసిన గురువులను, బాబా లను ఆశ్రయించాడు. శివుడున్నాడని, ఎందరికో కనిపించాడని, పిలిస్తే తప్పక వస్తాడని పురాణాల కధలను ఉదహరించారు. శివుడిని పొందటమే మానవ జన్మ పరమార్ధమని, దాని సాధనకై ఆచారాలు పాటించమని, దానధర్మాలు చేయమని, గురువులను సేవించమని, పుణ్య క్షేత్రములు దర్శించమని మార్గము చూపారు.  “జీవ” ఎలాగయినా శివుడిని పొందాలని కృత నిశ్చయముతో ఎప్పుడూ శివ నామ స్మరణ చేస్తూ గురువులను సేవిస్తూ, గురువు చెప్పిన ఆచార వ్యవహారాలను పాటిస్తూ ధర్మ మార్గములో జీవిస్తూ శివుడుకై ఆరాధించాడు. కాని శివుడు రాలేదు. కనపడలేదు. నిద్రలు లేని రాత్రులు, ఎదో వెలితి, దిగులు. ఆచారములో లోపము జరిగిందేమో, కరుణామయుడు పిలిచినంతనే వస్తాడని, రక్షిస్తాడని చెప్పరే, ఎందుకు రాలేదో, ఎక్కడ దోషము జరిగిందో?

 

“జీవ” తెలిసిన ఒక పండితుడిని ఆశ్రయించాడు. పూర్వ జన్మలలో చేసిన పాప పుణ్యములు, వాటి వాసనలు వలన నీవు జీవుడిగా జన్మించావు, అన్ని తొలగి నువ్వు పరిపూర్ణ శుద్ద మనస్కుడ వయితే గాని భగవంతుడు దొరకడు, ఫలితము ఆశించకుండా కర్మలను చేయుట వలననే అది సాధ్యము, శ్రవణ మనన నిధిధ్యాసలు ప్రధానము, భగవంతుడు భక్తసులభుడు కనుక ప్రయత్న లోపము లేకుండా భక్తితో నిరంతరము ధ్యానిస్తే  గత జన్మ పాపములన్ని తొలగి శివలోకము ప్రాప్తిస్తుంది, ఎందరో భక్తులు ఈ విధముగా మోక్షము పొందారు అని శాస్త్రాన్ని ఉటంకిస్తూ చెప్పి, ఆశీర్వదించి పంపాడు. “జీవ” కి  ఇంకా భయం పెరిగింది. “అమ్మో పూర్వ జన్మలలో చేసిన కర్మలు ఎవరికి తెలుసు? ఎన్ని జన్మలు ఎత్తానో? ఎన్ని కర్మలు చేశానో? ఈ లెక్కంతా ఎప్పటికి తేలేను? నిరంతరము శివధ్యాస ఏ మహా పురుషులకో సాధ్యముగాని, నాకు ఈ సంసారములో సాధ్యమేనా? ఈ జన్మకి శివుడిని చూడలేనేమో? ఇలా ఇంకెన్ని జన్మలు ఎత్తాలో?” “జీవ” లో ఒక రకమైన నిరాసక్తత, నిస్పృహ ఆవహించింది. ఓడిపోతున్నానన్న ఉక్రోషం, కసి. తెలియని ఆందోళన. శివుడు అందరివాడు కాదా? శివుడిని పొందటం ఇంత  కష్టమా? గుండె బరువెక్కి కన్నీరై కలచివేసింది.

 

“జీవ” చివరగా సనాతన ధర్మ ప్రచారములో వున్న సిద్ధ పురుషులను, తత్వ వేత్తలను ఆశ్రయించాడు. వారు ఉపనిషత్తులలోని మహా వాక్యం “అహం బ్రహ్మాస్మి” - “నేనే దేవుడను(శివుడను)” మరొక మహావాక్యం “సర్వం ఖల్విదం బ్రహ్మ” “ఉన్న దంతయూ బ్రహ్మమే (శివుడే)” అని, జీవుడే బ్రహ్మమని, ఆ సత్యాన్ని జీవుడు మరచిపోయాడని, అందుకే శాస్త్రము యొక్క ఆవశ్యకత అని, శివుడు నీకంటే ఎప్పుడూ వేరుగా లేడని, నీవు చేయు సాధనలన్ని మనోశుద్ధి కొరకు మాత్రమేనని,  ఉపదేశించారు. నమ్మ లేని నిజం. కాని సత్యం. అవునా నేనే దేవుడనా? ప్రపంచమంతా భగవంతుడుతో నిండి వుందా? భగవంతుడు ఎక్కడో లేడా? నాలోనే నేనుగా వున్నాడ? ఆ విషము నీను మరచి పోయానా? నేనెక్కడ? శివుడెక్కడ? ఇన్నాళ్ళుగా నా నుండి వేరుగా దైవంగా చూసిన శివుడ్ని ఇప్పుడు నేనేనని ఎట్లా అంగీకరించేది? మింగుడు పడలేని నిజం. శాస్త్రము ఎంత చెప్పినా మనసు శివుడను నేనంటే  అంగీకరించలేక పోతోంది.

 

ఎందరో సత్యం తెలియకనే పోయారు. ఎందరో శివుడి దర్శనం కోసం నిరంతరం తపిస్తున్నారు. ఎందరో అలసిపోయి విరక్తి చెందారు. ఎందరో పిచ్చి వాళ్ళయ్యారు. ఎందరో నిజం తెలిసినా నమ్మలేకున్నారు. ఎందరో అన్య మతాలను ఆశ్రయించారు. ఎందరో దేవుడి మీద నమ్మకాన్నే వదిలేసారు. ఎవరు దీనికి కారణం? జీవుడి అజ్ఞానమా? జీవుడే బ్రహ్మమన్న నిజం ముందు నుంచి మన ఆచరణలో పూర్తిగా లేక పోవటమా? పసి తనంనుండే శివుని వేరుగా చూపి, మన వాక్చాతుర్యముతో వినసొంపైన ఉపన్యాసాలతో, ఆధ్యాత్మికులని, లౌకికులని, జ్ఞానులని, అజ్ఞానులని, పండితులని, పామరులని, భక్తులని, నాస్తికులని, గురువులని, శిష్యులని, ఆచార వ్యవహారములని, కులాలని, మతములని, జాతులని, వర్ణాలని, వర్గాలని మనమే నిర్ధారించి, శివుడిని గుళ్ళో పెట్టి, అంతా కలిపి ఒక పెద్ద చిక్కు ముడి వేసి, ఇప్పుడు ఉన్నదంతా పరమాత్మనే, ఇప్పటి వరకు చేసినదంతా మీ మనోశుద్ధి కొరకే, జీవుడు, శివుడు, ప్రపంచం ఒక్కటే అంటే సామాన్యుడు దాక ఎందుకు, ఎన్నో శాస్త్రాలు చదివిన పండితులే తికమక పడరా? శాస్త్రం మీద గౌరవం ఉంటుందా?

 

తరతరాలుగా జీవుడికి బ్రహ్మమును వేరుగా చూపి, వాడిలోని శివుడు వాడికే అందని ద్రాక్ష పండు చేసి మనుగడను సాగిస్తున్న ఓ సమసమాజ పెద్దలారా ఈ కోటానుకోట్ల మానవులు ఎప్పటికైనా శాస్త్రం చెప్పిన జీవబ్రహ్మైక్యము పొందగలరా?

No comments:

Post a Comment

   అంకితము          జననీ జనకులకు కల్యాణ స్వర్ణోత్సవ సందర్భముగా                     ( 02.06.1967  –  02.06.2017)                             ...